టీమిండియాకు భారీ షాక్ - ఇంగ్లండ్ దెబ్బకు అగ్రస్థానం గల్లంతు
భారత క్రికెట్ జట్టుకు తేరుకోలేని దెబ్బతగిలింది. ఐర్లాంట్, ఇంగ్లండ్ జట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు అజేయంగా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్ కిందికి పడిపోయింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత్ గెలిచి ఉంటే టాప్ ర్యాంక్‌ను కాపాడుకొనే అవకాశం ఉండేది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలో సుదీర్ఘంగా ఉన్న అగ్రస్థానం ఘనత చేజారింది.
భారత జట్టు 2022 ఫిబ్రవరిలో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో మెరుగ్గా రాణించింది. రెండు టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గింది. ఆసియా కప్‌లనూ సొంతం చేసుకుంది. దీంతో అగ్రస్థానం దాదాపు 1600 రోజులకుపైగా పదిలంగా ఉంది. ఎప్పుడైతే ఐర్లాండ్‌తో సిరీస్‌ను కోల్పోయిందో.. అప్పట్నుంచి రేటింగ్ పడిపోవడం మొదలైంది. ఇప్పుడు ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో భారత్ (268) టాప్ ర్యాంక్‌నూ కోల్పోయింది. మరోవైపు ఇంగ్లాండ్ (268) తన రేటింగ్‌ను మెరుగుపర్చుకుంది. రేటింగ్‌పరంగా ఇరు జట్లూ సమంగా ఉన్నప్పటికీ.. సిరీస్‌ను ఇంగ్లండ్ నెగ్గడంతో అగ్రస్థానం దక్కించుకుంది.
ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్ (897), అభిషేక్ శర్మ (881) టాప్-2లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వీరిద్దరూ మెరుగైన ఆటతీరే ప్రదర్శించారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి వరుణ్ చక్రవర్తి (697), బుమ్రా (668) మాత్రమే టాప్-10లో ఉన్నారు.
