భర్తను గుడికి తీసుకెళ్లి హత్య చేసి భర్త బైకుపై ప్రియుడితో దర్జాగా వెళ్లిన వివాహిత
ఈకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకునేటపుడే తమకు ఇష్టం లేదని పెద్దలు నొచ్చుకుంటారని విషయాన్ని దాచిపెట్టి ఆ తర్వాత వివాహేతర సంబంధాలలో కూరుకుపోతున్నవారి సంఖ్య అధికమవుతోంది. ఇక మరికొందరు పనిచేసే చోట లేదంటే ఇరుగుపొరుగు వారితోనో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా వున్నారని భావించి భర్తను లేదా భార్యను హత్య చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇట్లాంటి సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
తన ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు భర్త అడ్డుగా వున్నాడని అతడిని గుడికి వెళ్దామని చెప్పి తీసుకుని వెళ్లి అక్కడే హతమార్చిన దారుణం బైటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడుకి చెందిన రమేష్ అనే వ్యక్తి హోసూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లా కుప్పంకి చెందిన హాసినితో పెళ్లయ్యింది. వీరికి ఓ పాప కూడా వుంది. ఐతే హాసిని గోప్యంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో తమ బంధానికి భర్త అడ్డుగా వున్నాడని అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నది. భర్తను సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఆలయానికి బైకుపై వెళ్దామని చెప్పి తీసుకెళ్లింది. ఐతే సమయం రాత్రి 10 దాటినా రమేష్, హాసిని ఎంతకీ రాకపోవడంతో హాసిని తల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆలయానికి సంబంధించిన సీసీ కెమేరాలను పరిశీలించగా, వచ్చేటపుడు భర్తతో వచ్చిన హాసిని, వెళ్లేటప్పుడు మరో ఇద్దరితో కలిసి భర్త ద్విచక్రవాహనంపై వెళ్లడాన్ని గమనించారు. దాంతో సమీప అటవీ ప్రాంతంలో గాలించగా రమేష్ మృతదేహం లభించింది. దీనితో రమేష్ భార్య హాసిని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకని దర్యాప్తు చేస్తున్నారు.
