బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (14:30 IST)

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పరు. ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద ఈర్లపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎంస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంగళవారం 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండం నాయునపల్లిలో చేనేత పార్కుకూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం.  రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నాం. 
 
పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైకాపా పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారు' అని చంద్రబాబు అన్నారు.