పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వైకాపా మాజీ మంత్రి, మాజీ మంత్రి విజయసాయి రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకపుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇరువురు నేతల మధ్య ఈ రకమైన అభినందనలు తెలుపుకోవడం సోషల్ మీడియాలో నెటిజన్లు సరికొత్త చర్చకు దారితీశారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. దీంతో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, దేశానికి సేవ చేసే శక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి వైకాపాకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని విజయసాయి రెడ్డి చెప్పినప్పటికీ భవిష్యత్‌లో ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇపుడు పవన్‌కు విషెస్ తెలపడం ద్వారా మరోసారి ఆయన తన రాజకీయ భవితవ్యంపై చర్చకు అవకాశం ఇచ్చారు.