కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త బిజినెస్ ప్రారంభించింది. ట్రూలీ స్మా పేరుతో తన కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఒక కొత్త అధ్యాయం మొదలైంది.. అనే క్యాప్షన్‌తో ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సమంత సాకీ పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు ట్రూలీ స్మాతో ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు.
ఇలా సమంత ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా, నిర్మాతగానూ మారారు.
మరోవైపు, సినిమాల పరంగా కూడా సమంత చాలా బిజీగా ఉన్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సామ్... ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తుండగా, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు బాలీవుడ్‌లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు.