1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM CBN visiting Tirumala today, for a ceremony where an anonymous devotee is donating 121 kg of gold ornaments to Lord Venkateswara

తిరుమల పర్యటనకు సీఎం చంద్రబాబు - అజ్ఞాత భక్తుడు ఇచ్చే కానుకలు స్వీకరణ

chandrababu
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడంతో పాటు, ఓ భక్తుడు సమర్పించే భారీ బంగారు కానుకల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం సమక్షంలో సదరు అజ్ఞాత భక్తుడు స్వామివారికి దాదాపు 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనుండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వాటిని అధికారికంగా స్వీకరించనున్నారు.
 
కాగా, సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన వివరాలను పరిశీలిస్తే, గురువారం ఉదయం 8.30 గంటలకు ఆయన అమరావతి నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. ఉదయం 10.00 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల ప్రాంగణంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించి, ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి చేరుకుంటారు.
 
అనంతరం ఉదయం 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనం పూర్తయిన తర్వాత, ఉదయం 11.35 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఓ భక్తుడు స్వామివారికి కానుకగా అందజేస్తున్న 121 కిలోల బంగారు ఆభరణాలు, అందులో భాగంగా శ్రీవారి దివ్య కిరీటం, పద్మపాదాల ఆభరణాలను టీటీడీ పాలకమండలి, అధికారులు అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి భాగస్వామ్యం కానున్నారు.
 
ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి తిరుపతి నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళతారు. అక్కడ తన కార్యక్రమాలు ముగించుకుని, సాయంత్రం 4.30 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని టీటీడీ అధికార యంత్రాంగం, జిల్లా పోలీసులు తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీలో తొలి దశ మలి విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం