గత పాతికేళ్లుగా నీ అసిస్టెంట్‌గానే ఉన్నాను.. గంగూలీతో యువరాజ్
భారత దిగ్గజ మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. నువ్వు నా అసిస్టెంట్ అవుతావా అని సౌరవ్ గంగూలీ ప్రశ్నించగా, గత 25 యేళ్లుగా నీకు అసిస్టెంట్‌గానే కదా ఉన్నాను. ఇపుడూ నా పని అదే కదా అంటూ చేసిన వ్యాఖ్యానించారు.
భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ ఇద్దరు మేటి క్రికెటర్లు ఇపుడు ప్లేయర్లు కాదు.. కోచ్‌లుగా మారారు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. ఆ జట్టు ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీని ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యువరాజ్‌ను ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎంట్రీ సందర్భంగా గంగూలీతో యువీ సరదా సంభాషణ ఇలా..
గంగూలీ : నువ్వు నా అసిస్టెంట్ అవుతావా?
యువీ : (నవ్వుతూ) నేను గత 25 ఏళ్లుగా నీకు అసిస్టెంట్‌నే కదా.. ఇప్పుడూ నా పని అదే.
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లకు యువరాజ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రాంచైజీ కోచింగ్ సెటప్‌లోకి అడుగు పెట్టడంపై యువీ హర్షం వ్యక్తం చేశారు. 'ఈ బాధ్యతల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కెరీర్లో నన్ను ప్రోత్సహించిన గంగూలీని గురువుగా, పెద్దన్నలా భావిస్తా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లందరినీ కలుపుకొని వెళ్లడం, గెలుపు సంస్కృతిని అలవర్చడంలో గంగూలీ శైలే వేరు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది' అని యువీ చెప్పుకొచ్చారు.

