1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Tilak Varma and Nitish Reddy talk in Telugu on pitch Nara Lokesh shares video.

ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వేదికపై తెలుగు మాటలు (వీడియో)

tilak varma - nitish reddy
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ వేదికపై తెలుగు మాటలు వినిపించాయి. ఇంటర్నేనల్ టీ20 క్రికెట్ మ్యాచ్‍ కోసం బరిలోకి దిగిన ఇద్దరు తెలుగు క్రికెటర్లు తెలుగులో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్‍‌లో షేర్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, శనివారం టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న భారత జట్టును తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో గట్టెక్కించారు. ఓటమి అంచున ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, మైదానంలో ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటూ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రదర్శనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు.
 
ఈ మేరకు లోకేశ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయపూర్వక అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఓటమి అంచుల నుంచి సమన్వయంతో ఆడి జట్టును గెలిపించారని కొనియాడారు. దీనికి సంబంధించిన క్రిక్ బజ్ వీడియోను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు.
 
లోకేశ్ పంచుకున్న ఈ వీడియోలో తిలక్, నితీశ్ క్రీజులో ఉండగా ఒకరితో ఒకరు తెలుగులో మాట్లాడుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది. వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో తెలుగులోనే చర్చించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో మరో విశేషం కూడా ఉంది. ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా తెలుగులో మాట్లాడటం గమనార్హం. 
 
హర్షా భోగ్లే పక్కా హైదరాబాదీ కాగా, దినేశ్ కార్తీక్ మూలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ షోకు హోస్ట్‌గా ఉన్న నటి సయామీ ఖేర్, సాయి దుర్గా తేజ్ తొలి చిత్రం 'రేయ్'లో హీరోయిన్గా నటించడం గమనార్హం. మొత్తం మీద, కేవలం క్రీడా విజయమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై తెలుగు భాషకు దక్కిన గౌరవంగా ఈ సంఘటనను పలువురు అభివర్ణిస్తున్నారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్‌ నియామకం