త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ : ఏపీ సీఎస్ విజయానంద్
పౌరులకు ప్రభుత్వ సేవలను, పాలనను మరింత చేరువ చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకురావాలని సంకల్పించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతిక సహకారాన్ని అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు.
ఆర్టీజీ శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు సీఎస్‌కు స్వాగతం పలికి ఆర్టీజీఎస్ చేపడుతున్న కార్యకలాపాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ సాంకేతిక యుగంలో, ప్రభుత్వ శాఖలో మెరగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. ఆర్టీజీఎస్‌ను ప్రభుత్వంలో సాంకేతికపరంగా ఒక కటింగ్ ఎడ్జ్‌గా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. తానుకూడా ఇకపైన ఆర్టీజీఎస్ కార్యకాలాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.
వాట్సాప్ గవర్నెన్స్‌ను సంబంధించి పనులు ఎంతమేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించి అన్ని అన్ని పనులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు. దానికి సంబంధించి డెమోను సీఎస్ కు చూపించారు. 150 రకాల సేవలను ప్రజలకు దీని ద్వారా అందించడాని సిద్ధంగా ఉన్నామన్నారు. దాంతో పాటు ప్రజలు తమ ఫిర్యాదులు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ఉండేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న ఇన్నోవేషన్ టెక్నాలజీలను ఆయా శాఖలకు పంపి, వారి ఆర్టీజీఎస్ నుంచి ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో వారితో నేరుగా చర్చించి, ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంతమేర సాంకేతిక సహకారం అందివ్వాలని సూచించారు.
ప్రభుత్వ శాఖల్లో లోపాలను ఎత్తి చూపడం కాకుండా, వాటి పనితీరు మరింత మెరుగవ్వడానికి ఆర్టీజీఎస్ దోహదపడేలా తన సాంకేతిక సదుపాయాలను అందించాలన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ప్రతి శాఖకు ఒక ప్రతినిధిని పంపి, అక్కడి శాఖాధిపతి, అధికారులతో చర్చించి పౌరులకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి సాంకేతిక పరిష్కారాలు కనుగొని ఆయా శాఖల పనితీరు మెరుగవ్వడానికి దోహదపడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి, అధికారులు పాల్గొన్నారు.