పీఆర్పీని స్థాపించిన విజయసాయి రెడ్డి.. సీఎం పోస్టుపై ఆసక్తి లేదంటూ ప్రకటన
PRP
కొత్త పార్టీ ప్రారంభించిన సందర్భంగా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని తన పార్టీ అందిస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలను, అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాలను వాడుకునే ధోరణిని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువతకు, సమర్థులైన నాయకులకు పరివర్తన రాజనీతి పార్టీ ఒక వేదికగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఇంకా పార్టీలో తన పాత్ర గురించి కూడా విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆసక్తి లేదని, పార్టీకి కన్వీనర్‌గా లేదా మార్గదర్శిగా ఉంటూ, అర్హులైన వారికి నాయకత్వ అవకాశాలు కల్పిస్తానని ఆయన చెప్పారు. తర్వాతి తరం రాజకీయ నాయకులను తీర్చిదిద్దే వేదికగా తన పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. ఉచిత విద్యుత్, ఉపాధి కల్పన, ఆర్థిక క్రమశిక్షణ వంటివి ఈ పార్టీ ఎజెండాలో ఉన్నాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తమ విధానాలను వివరించేందుకు విశాఖపట్నం, తిరుపతి, అనంతపురాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
చాలా కాలం పాటు వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, వైఎస్‌ఆర్‌సీపీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా విజయసాయి రెడ్డి కొనసాగారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సొంతంగా పార్టీని స్థాపించడం రాజకీయంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నిర్మాణం, దాని నాయకత్వ శైలి గురించి బయటి వ్యక్తుల కంటే ఆయనకు బాగా తెలుసు.
అయితే, పార్టీని ప్రారంభించడం ఒక ఎత్తు అయితే, దానిని నిలబెట్టుకోవడం, బలమైన కార్యకర్తల వ్యవస్థను నిర్మించడం మరో సవాలు. పరివర్తన రాజనీతి పార్టీ కేవలం మరో రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అంతకు మించినదని ఆయన ఓటర్లను నమ్మించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే, వైఎస్‌ఆర్‌సీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను, ఓటర్లను ఆయన తన వైపు తిప్పుకోగలరా.. ఓట్ల శాతంలో చిన్న మార్పు వచ్చినా, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయవచ్చు. ఏది ఏమైనా, పరివర్తన రాజనీతి పార్టీ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతే ఈ పార్టీ అసలు బలం ఏమిటో స్పష్టమవుతుంది.
#VijaySaiReddy New Party Name is PRP!! Parivartan Rajniti Party. https://t.co/gXNSRjTWyY
— cinee worldd (@Cinee_Worldd) November 11, 2026

