ఇంట్లో నుంచి కాలు బయటపెట్టొద్దు.. వైకాపా ఎంపీ అవినాశ్‌కు పోలీసుల నోటీసు
వైకాపా నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ అందులో పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి తన పరివారంతో గ్రామాల్లో పర్యటిస్తే గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
పులివెందుల పరిధిలోని గ్రామాల్లో ఎంపీ పర్యటిస్తే శాంతిభద్రత సమస్యలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పక్కా సమాచారాన్ని అందించాయి. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్ళి నోటీసులు అందజేయడంతో పాటు వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని పంపించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు, పాత కేసులకు సంబంధించిన కొందరు వైకాపా కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే, వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఉన్ారని, వారిని విడిచిపెట్టాలని అవినాశ్ రెడ్డి పోలీసులను కోరారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేముల మండలాల్లో ఇప్పటికే రాజకీయ ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

