1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone Arnab Live Updates: Andhra Pradesh braces for very severe storm, Andaman schools shut, West Bengal and Nepal on heavy rain alert

ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను - విశాఖకు ఆగ్నేయంగా 220 కిమీ దూరంలో (Vedio)

arnab cyclone alert
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 340, బాపట్లకు 410, ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్ పూర్‌కు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ తుపాను బుధవారం ఉదయం బాపట్ల - విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ముఖ్యంగా యానాం వద్ద తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా మారి గంటకు 125 కిమీ నుంచి 135 కిమీ వేగంతో గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అర్నబ్ తుపాను ఎఫెక్ట్ : 12 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే - రైళ్ల వివరాలు ఇవే.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అర్నబ్ తుపాను భయపెడుతుంది. ఈ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను బుధవారం కాకినాడ - విశాఖపట్టణ ప్రాంతాల మధ్యలో ఉన్న యానాంలో తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
ఈ నేపథ్యంలో అక్టోబరు 27వ తేదీ మంగళవారం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, లింగంపల్లి నుంచి బయల్దేరే గోదావరి, ఫలక్‌నుమా, గరీబ్‌రథ్‌, విశాఖ, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. నాగర్‌సోల్‌ - నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 28న శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. 
 
రద్దు చేసిన రైళ్ల వివరాలు.. 
అర్నబ్' తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే మంగళవారం 12 రైళ్లను రద్దు చేసింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 12704 సికింద్రాబాద్ - హౌరా, 17016 సికింద్రాబాద్ - భువనేశ్వర్, 12728 హైదరాబాద్ - విశాఖపట్నం, 12862 మహబూబ్‌నగర్ - విశాఖపట్నం, 12740 సికింద్రాబాద్ - విశాఖపట్నం, 12776 లింగంపల్లి - కాకినాడ టౌన్, 17256 లింగంపల్లి - నరసాపురం, 12738 లింగంపల్లి - కాకినాడ పోర్ట్, 20810 హెచ్.ఎస్. నాందేడ్ - సంబల్‌పూర్, 07037 చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్, 07038 శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి. అలాగే, నాగర్‌సోల్ నుండి నరసాపురం వెళ్లే 12788 నంబర్ గల రైలును పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత 
ఇదిలావుంటే, అర్నాబ్ తుపాను కారణంగా ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 
 
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని.. అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని మంత్రి అనిత సూచించారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సబ్-జైలు నుండి 16 మంది విచారణ ఖైదీలు ఎస్కేప్.. జైలు సిబ్బంది సస్పెండ్