1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone Akvan LIVE Updates: AP braces for 145kmph winds, extremely heavy rain; IMD issues red alert for 7 coastal districts

ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అక్వాన్... కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

akvan cyclone
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను వేగంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గురువారానికి ఇది అతి తీవ్ర తుఫానుగా బలపడి, నవంబరు 20వ తేదీ మధ్యాహ్నం కాకినాడ - యానాం తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
మంగళవారం నాటి సమాచారం ప్రకారం, ఈ తుఫాను చెన్నై నగరానికి 590 కి.మీ., మచిలీపట్నానికి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా వాయవ్య దిశగా కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకవచ్చని అధికారులు తెలిపారు. నెల్లూరు నుంచి తుని లేదా విశాఖపట్నం సమీప ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
 
తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, నవంబరు 19, 20 తేదీల్లో కొన్ని చోట్ల 21 సెం.మీ.కి పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడవచ్చు. 
 
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక సంకేతాలను ఎగురవేశారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర తీరాన్ని తాకనున్న మూడో తుపాను కావడంతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
 
ఈ తుపాను ప్రభావం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై కూడా ఉంటుందని జాతీయ వార్తా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. నవంబరు 20, 21 తేదీల్లో ఛత్తీస్ గఢ్ లోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కుల్గాంలో ఎన్‌కౌంటర్... లష్కర్ కమాండర్ లతీఫ్ భట్ హతం