ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు : ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు మూడు మండలాలు మినహా మిగతాచోట్ల యథావిధిగా జరగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 'మురసు' తుపాను నేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నందున ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ అనిల్ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.
వర్షాలు తగ్గాయని ఎక్కువ మంది కలెక్టర్లు ఎస్‌ఈసీకి తెలిపారు. పరిమిత సంఖ్యలో మినహా మిగిలిన చోట్ల పోలింగ్‌కు ఇబ్బంది లేదని చెప్పారు. దీంతో నవంబరు 5న ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు చర్యలకు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులుంటే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
గుంటూరు జిల్లాలోని 3 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఈసీ తెలిపింది. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

