1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayawada : young woman caught transporting drugs for commission

ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలి 'మత్తు' మార్గం

drug
జైలులో ఉన్న తన ప్రియుడిని బెయిలుపై విడిపించుకునేందుకు అవసరమైన డబ్బులు సంపాదించుకునేందుకు ప్రియురాలు మత్తుమార్గాన్ని ఎంచుకుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటన ఏపీలోని విజయవాడ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈనాడు, అమరావతి: జైలులో ఉన్న ప్రియుణ్ని విడిపించుకునేందుకు డబ్బులు అవసరమై.. కమీషన్ కోసం డ్రగ్స్ తెస్తూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఈగల్, జీఆర్పీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 
 
విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్యకు మత్తుపదార్థాలు తీసుకునే అలవాటు ఉంది. నగరంలోని కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా కూడా చేస్తుంటుంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ డ్రగ్స్ సరఫరా చేస్తూ చిత్తూరులో మూడు నెలల క్రితం పట్టుబడి, జైల్లో ఉన్నాడు. అతడిని విడిపించుకునేందుకు నాగసౌమ్య వద్ద డబ్బులు లేకపోవడంతో అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలో నగరంలో మెథిలిన్ డైఆక్సీ మెథాంఫిటమిన్ (ఎండీఎంఏ) సరఫరా చేసే కృష్ణలంకకు చెందిన బషీర్ అనే డ్రగ్ సప్లయర్‌ను కలిసింది. ఈ సందర్భంగా నాగసౌమ్యకు రూ.లక్ష ఇచ్చి బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకురమ్మని చెప్పాడు. సరకును క్షేమంగా నగరానికి చేరిస్తే రూ.50 వేల కమీషన్ ఇస్తానని చెప్పడంతో ఆమె అంగీకరించింది. ఈ నెల 13న బెంగళూరులోని యలహంక వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తికి కాల్ చేయటంతో అతను రెండు కవర్లలో 110 గ్రాముల ఎండీఎంఏ ఇచ్చాడు. సరకును తీసుకుని బెంగళూరులో రైలెక్కి, విజయవాడ బయలుదేరింది. 
 
ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలో పోలీసులు కాపుకాశారు. బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్ మంగళవారం అర్ధరాత్రి విజయవాడ రైల్వేస్టేషన్ చేరింది. రైల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారని సౌమ్య చెప్పడంతో బషీర్ రైల్వేస్టేషన్ నుంచి పరారయ్యాడు. ఎండీఎంఏ పోలీసులకు దొరక్కుండా సౌమ్య తన ప్యాంటులో ప్రత్యేకంగా కుట్టించుకున్న చిన్నజేబులో దాచింది. పోలీసులు తనిఖీల్లో గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. పరారైన బషీర్‌ను విజయవాడలో బుధవారం పట్టుకున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అలా చేస్తే బీసీ రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు