వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర తీరానికి చేరుకోనున్న అక్వాన్ తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలినట్లు వాతావరణశాఖ తెలిపింది.
ప్రస్తుతం ఇది అండమాన్‌కు 640 కి.మీ. చెన్నైకు 760 కి.మీ, విశాఖకు 870 కి.మీ, గోపాల్‌పూర్‌కు 980 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. దక్షిణ మధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సోమవారం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశముందని తెలిపింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారే వీలుందని పేర్కొంది.
ఆ తదుపరి 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ అక్వాన్గా నామకరణం చేసింది. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ సూచించారు.

