1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Renowned Artist Srinivasan, Known for Tirumala Deity paintings, Dies

శ్రీవారికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాస్ ఇకలేరు

srinivasan tirumala deity
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి రూపమిచ్చిన చిత్రకారుడు ఎస్.ఎం.శ్రీనివాసన్ (86) ఇకలేరు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్రంలోని కోవిల్‌పట్టిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. 
 
తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు చదివి ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గత 1970లో ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించింది. గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా దర్శించి, స్వామివారి దివ్య రూపాన్ని ఆయన తన కుంచెతో చిత్రీకరించారు. 
 
స్వామివారు సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపం ఒకటి, ఆభరణాలు లేకుండా ఉన్న నిరాడంబర రూపం మరొకటి. ఇలా రెండు రకాలు అద్భుతమైన చిత్రాలను ఆయన గీశారు. ఈ చిత్రాలు అనతికాలంలోనే భక్తుల్లో అశేష ప్రాచూర్యం పొందాయి. 
 
నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంట్లో వ్యాపార సంస్థల్లో కనిపించే శ్రీవారి చిత్రం శ్రీనివాసన్ గీసిందే. వేంకటేశ్వర స్వామిత పాటు ఆయన పలు ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా గీసి మెప్పించారు. 
 
కోవిల్పట్టిలోని మండితోపు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో మరణవార్త తెలియగానే పలువురు ప్రముఖులు స్థానికులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. శ్రీవారి రూపానికి తన కుంచెతో శాశ్వతత్వాన్ని అందించిన శ్రీనివాసన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ