1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. andhra pradesh Panchayat Election

ఏపీలో పంచాయతీ పోరు : బరితెగించిన వైకాపా నేతలు

Pulivendula
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం సాగుతోంది. ఇందులోభాగంగా పులివెందుల నియోజకవర్గంలో నిప్పులు చెరుగుతోంది. పల్లె పోరు ప్రశాంతంగా సాగాల్సిన చోట.. కవ్వింపు చర్యలు, దాడులు, దహనకాండతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. 
 
నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లోనూ వైకాపా, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం అలుముకుంది. సోమవారం అర్థరాత్రి నుంచి మొదలైన అలజడి.. నామినేషన్ల పర్వం ప్రారంభమైన బుధవారంతో మరింత రాజుకుంది. టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో పలుచోట్ల పరిస్థితి అదుపు తప్పింది. 
 
తొండూరు మండలం మల్లెల గ్రామంలో టీడీపీ వార్డు సభ్యులుగా బరిలోకి దిగుతున్న శ్రీనివాసులు, మహబూబ్‌బాషాలకు చెందిన ద్విచక్ర వాహనాలకు వైకాపా నాయకులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి వేళ ఆ వాహనాలు కాలి బూడిదవ్వడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వేంపల్లెలో నామినేషన్ల దాఖలుకు బల ప్రదర్శనగా తరలివచ్చిన వైకాపా వర్గీయులను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం దిగారు. 
 
వేంపల్లె మండలం ఇడుపులపాయకు చెందిన టీడీపీ నేత పీపీ.చండ్రాయుడు వేంపల్లెలో కార్యకర్తలతో సమావేశమై రాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా.. గండి రోడ్డులోని బృందావనం కాలనీ వద్ద అడ్డగించి దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది.
 
అంతేకాకుండా, నామినేషన్ల సందర్భంగా వైకాపా వర్గీయులు పలు చోట్ల పోలీసుల ఆంక్షలను లెక్క చేయడం లేదు. నామినేషన్ల కేంద్రాల వద్దకు ర్యాలీలుగా, గుంపులుగా వస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లి, ముత్తుకూరు, నాగూరు, పాములూరు గ్రామాల్లో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. 
 
వేంపల్లె నామినేషన్‌ కేంద్రం వద్దకు వైకాపా నాయకులు గుంపులుగా దూసుకురావడంతో పోలీసులు పశువుల ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చాగలేరులోనూ టీడీపీ, వైకాపాల వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. చక్రాయపేట, సింహాద్రిపురం, వేముల మండలాల్లోనూ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. కొన్నిచోట్ల రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  
 
ఒకవైపు వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయగా ఆయన తీసుకోలేదు. ఆ తర్వాత ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వైకాపా నేతలు ఉల్లంఘిస్తున్నారు. ఈ ఘటనలపై ఆయా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో అక్వాన్ ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..