డీఎస్సీ 2026 నోటిఫికేషన్ .. 2111 పోస్టులు భర్తీ చేస్తాం : పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం నిరుద్యోగులకు ఏపీ సర్కారు తీపికబరు అందించింది. డీఎస్సీ 2026 ద్వారా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
మొత్తం పోస్టుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో 1,709 పోస్టులు ఉండగా, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 402 పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 1,205 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు ఉన్నాయి. ఇందులో 1,069 జనరల్ కేటగిరీ కింద, 136 మున్సిపల్ పరిధిలోని ఖాళీలు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే.. హిందీలో 202, సోషల్ స్టడీస్ లో 160, బయోలాజికల్ సైన్స్ 151, ఫిజికల్ ఎడ్యుకేషన్ 110 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలుగు, ఉర్దూ, తమిళం వంటి భాషలకు 110, ఇంగ్లీష్‌కు 87, ఫిజికల్ సైన్సెస్‌కు 45, గణితానికి 41 పోస్టులను కేటాయించారు.
మొత్తం 2,721 ఖాళీలతో కూడిన డీఎస్సీ-2026 నోటిఫికేషనులో భాగంగా ఈ 2,111 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, 260 రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ల పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా, డిసెంబరు 20 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హతలు, దరఖాస్తు గడువు వంటి పూర్తి వివరాల కోసం అధికారిక పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

