1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. South Western Railway Removes Fixed Berth Limit for Bulk and Group Train Bookings

బల్క్ టిక్కెట్ల బుకింగ్‌పై సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం .. ఏంటది?

train
గ్రూపు (సమూహాలు)లుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం సౌత్ వెస్ట్రన్ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, విద్యా విహారయాత్రలు, తీర్థయాత్రలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రయాణించే వారి సౌకర్యార్థం బల్క్ (గ్రూప్) టికెట్ బుకింగ్ నిబంధనలను సవరించింది. పాత నిబంధనల స్థానంలో కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చినట్లు ఎస్‌డబ్ల్యూఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ మంజునాథ్ కనమడి వెల్లడించారు.
 
తాజా నిబంధనల ప్రకారం... గ్రూప్ టికెట్ల బుకింగుపై ఉన్న గరిష్ఠ బెర్తుల పరిమితిని ఎస్‌డబ్ల్యూఆర్ పూర్తిగా ఎత్తివేసింది. అంతేకాకుండా, ఈ బుకింగులకు అనుమతి ఇచ్చే అధికారాన్ని డివిజనల్ కార్యాలయాల నుంచి స్థానిక స్టేషన్లకే అప్పగించారు. ప్రధాన రిజర్వేషన్ కేంద్రాల్లోని స్టేషన్ మేనేజర్లు, చీఫ్ రిజర్వేషన్ సూపర్‍‌వైజర్లు ఇకపై ఎలాంటి ముందస్తు బెర్త్ పరిమితి లేకుండా గ్రూప్ బుకింగులను ఆమోదించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
 
సాధారణ అడ్వాన్స్ రిజర్వేషన్ సమయం ప్రారంభమైన గంట తర్వాత, అంటే ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. అన్ని తరగతుల్లో కన్ఫర్మ్, ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే, దరఖాస్తుదారులు నేరుగా రైల్వే అధికారులకే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైల్వే స్పష్టం చేసింది. కేవలం విదేశీ పర్యాటకులు, ఎన్నారైలకు మాత్రమే పాత నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది. 
 
దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రయాణికులందరి పేర్లు, వయస్సు, లింగం, చిరునామాతో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం దుర్వినియోగంకాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి, దరఖాస్తులపై సీల్, సంతకం చేయాలని రైల్వే ఆదేశించింది. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా అదే కౌంటరులో దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే దానిని ప్రత్యేక లావాదేవీగా పరిగణిస్తారని అధికారులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మద్యం మత్తు: మోటర్‌మ్యాన్ క్యాబిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువతి