ఇక అయ్యప్ప ప్రసాదం నేరుగా ఇంటికే..
శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే భక్తులు ప్రసాదాలను నేరుగా తమ ఇంటి చిరునామాకు పంపించుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి రానుంది. ట్రావెన్‌కోర్ దేవస్థానం మండలి, ఇండియా పోస్టు మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. మండల-మకర విలక్కు యాత్ర ఈ నెల 17న ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.
కొండపై ఆలయ సముదాయంలో ఉన్న అరవణ, అప్పం ప్రసాదాల కౌంటరు పక్కనే ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రం రోజంతా పని చేస్తుంది. ప్రసాదాన్ని ఏ చిరునామాకు పంపాలో చెప్పి బుక్ చేసుకుంటే వారు ఇళ్లకు చేరేలోపు అది చేరిపోతుంది. సన్నిధానం వద్దే కాకుండా దేశంలోని ఏ పోస్టాఫీసు ద్వారానైనా ఎక్కడికైనా స్పీడ్ పోస్టులో ప్రసాదాన్ని పంపించుకోవచ్చని అధికారిక ప్రకటన తెలిపింది.

