1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone Akvan has shifted northward toward North Andhra Pradesh and South Odisha

తీవ్ర రూపం దాల్చిన అక్వాన్ తుఫాను... దిశ మార్చుకుని దక్షిణ ఒరిశా తీరం వైపు...

Akvan cyclone
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఇది దిశ మార్చుకుని, తీవ్ర తుఫానుగా మారి ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం సహా దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ ఎండి వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఈ తీవ్ర తుఫాను నవంబరు 20 మధ్యాహ్నానికి నరసాపురం పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తీవ్ర తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలింది. ప్రస్తుతం ఇది నరసాపురానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ - ఆగ్నేయంగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పుగా 560 కిలోమీటర్లు, గోపాల్పూరు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా ఉత్తర వాయవ్య దిశలోనే ప్రయాణించి తీరం వైపు సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
 
ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్ ఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 
 
గురువారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
మరోవైపు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాబోయే 48 గంటల పాటు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
డీఎస్సీ 2026 నోటిఫికేషన్ .. 2111 పోస్టులు భర్తీ చేస్తాం : పాఠశాల విద్యాశాఖ