'అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు' సందేశాన్ని ఆచరించాలి : సీఎం చంద్రబాబు
అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు అన్న శ్రీ సత్యసాయి సందేశాన్ని ఆచరణలో పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భగవాన్ సత్యసాయి జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు... సత్యసాయి అందించిన ఆధ్యాత్మిక సందేశం, సమాజ సేవలను స్మరించుకున్నారు.
విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో సత్యసాయి అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని ఆయన చాటిచెప్పారన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస బోధనలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు అనే సాయి సందేశాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భారతీయ ఆధ్యాత్మికతను, సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు. విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలతో ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
సత్యసాయి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మానవ సేవే పరమావధిగా జీవించిన సత్యసాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

