ఆన్లైన్ ప్రేమ, పెళ్లాడేందుకు కెనడా నుంచి వచ్చిన వృద్ధ మహిళ, షాక్ తిన్న యువకుడు
డేటింగ్ యాప్ ద్వారా భారతదేశంలోని హరియాణకి చెందిన వ్యక్తికి కెనడాకి చెందిన మహిళతో పరిచయమైంది. ఆమెతో తరచూ మాట్లాడుతూ మరింత సన్నిహతమయ్యాడు. అది కాస్తా ప్రేమ బంధంగా మారింది. కానీ అసలు నిజం తెలిసి షాక్ తిన్నాడు. విషయం పోలీసులు దాకా వెళ్లింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
హరియాణాలోని పానిపట్ ప్రాంతంలో నితిన్ అనే 31 ఏళ్ల యువకుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తనకు సరైన జోడీ కోసం అతడు డేటింగ్ యాప్ ఆశ్రయించాడు. అందులో అతడికి కెనడాకి చెందిన మహిళ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీనితో ఆమె కెనడా నుంచి టూరిస్ట్ వీసాపై నవంబర్ 11న ఢిల్లీ వచ్చింది.
తను పెళ్లాడబోయే మహిళ వస్తుందన్న ఆనందంతో నితిన్ విమానాశ్రయానికి వెళ్లాడు. తీరా అక్కడ ఆమెను చూసి షాకయ్యాడు. ఆ మహిళ 61 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు. దీనితో ఆమెను వివాహం చేసుకునేందుకు అతడు ససేమిరా అన్నాడు. విషయం కెనడా ఎంబసీకి వెళ్లి పోలీసు స్టేషనుకి వచ్చింది. పోలీసులు ఇరువురినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మహిళను కెనడా పంపించేందుకు ఏర్పాట్లు చేసారు. అందుకే... ఇలాంటి యాప్‌లతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

