1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. What Is Wrong In Giving Wedding Invite To Chandrababu Vijayamma Open Letter In Support Of Sharmila

చంద్రబాబుకు పెండ్లి పత్రిక ఇస్తే తప్పేంటి : వైఎస్ విజయమ్మ

ys vijayamma
తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రిక ఇచ్చారు. దీనిపై వైకాపా శ్రేణులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా పలు రకాలైన కథనాలను వండి వార్చింది. చంద్రబాబుతో వైఎస్ షర్మిల చెట్టాపట్టాల్ అంటూ కథనాలు అల్లేసింది. వీటిపై జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు విజయమ్మ పేరుతో విడుదలైన ఒక బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తన బిడ్డ షర్మిలపై జరుగుతున్న ఈ పరిణామాలను చూసి ఎంతో బాధపడేవారని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ ప్రకారం.. ముఖ్యమంత్రి చంద్రబాకి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడంలో ఎలాంటి తప్పులేదని విజయమ్మ సమర్థించారు. వైఎస్సార్, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దాదాపు 50 ఏళ్ల క్రితమే వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం ఉండేదని గుర్తుచేశారు. ఒక తండ్రి వయసున్న వ్యక్తికి, తండ్రి మిత్రుడికి వెళ్లి శుభలేఖ ఇవ్వడం సంస్కారమని పేర్కొన్నారు. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు అని వైఎస్సార్ బలంగా నమ్మేవారని, రాజకీయ ప్రత్యర్థులతో కూడా గౌరవప్రదమైన సంబంధాలను కొనసాగించిన చరిత్ర ఆయనదని వివరించారు.
 
ప్రస్తుతం రాజకీయ లక్ష్యం కోసం సొంతవారే తప్పుడు రాతలు రాస్తూ, వ్యక్తిత్వంపై బురదజల్లుతుండటం అత్యంత బాధాకరమని విజయమ్మ విమర్శించారు. షర్మిలను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. షర్మిల గతంలో చేసిన పాదయాత్రలు, పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు సామాన్యమైనవి కావని, వైఎస్సార్ జీవించి ఉన్న సమయంలో ఎన్నడూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహించలేదని తెలిపారు.
 
వైఎస్ కుటుంబ వారసత్వం అంటే కేవలం పదవులు, ఆస్తులు మాత్రమే కాదని, ప్రజల పట్ల ప్రేమ, మాట తప్పని నైజం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటమే అసలైన వారసత్వమని విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిలలో రాజశేఖర్ రెడ్డి ఆలోచనా విధానం, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, పోరాట పటిమ స్పష్టంగా కనిపిస్తాయని ప్రశంసించారు. ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉందని, ఈ తప్పుడు ప్రచారాలు ఆమెను బలహీనపరచలేవని భరోసా ఇచ్చారు.
 
రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కోవాలని, అంతేకానీ కుటుంబ బంధాలను, మహిళల ఆత్మగౌరవాన్ని రాజకీయాలకు బలి చేయవద్దని విజయమ్మ హితవు పలికారు. వైఎస్సార్ ఆశయాలు, విలువల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, షర్మిల చేసిన త్యాగాలను, పడిన కష్టాన్ని ఎవరూ మరచిపోకూడదని ఆమె ఆ లేఖలో పిలుపునిచ్చారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)