1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Seven Tirumala pilgrims’ families receive Rs 2 lakh each under TTD insurance scheme

తిరుమలలో ఏడుగురు యాత్రికుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

Tirumala Brahmotsavams
తిరుమల తిరుపతి దేవస్థానం, గత రెండు నెలల్లో తిరుమలలో మరణించిన ఏడుగురు యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశాయి. ఈ పరిహారాన్ని శ్రీవారి యాత్ర సురక్ష పథకం కింద చెల్లించారు. ఇది టీటీడీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సంయుక్తంగా ప్రారంభించిన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం.
 
ఈ నేపథ్యంలో గత రెండు నెలల్లో తిరుమలలో మరణించిన ఏడుగురు యాత్రికుల కుటుంబాలకు 'శ్రీవారి యాత్ర సురక్ష పథకం కింద టీటీడీ పరిహారాన్ని అందించింది, టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి, సి. వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. దొరైస్వామి లబ్ధిదారులకు ఈ పరిహార చెక్కులను అందజేశారు.
 
తిరుమలకు వచ్చే యాత్రికులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ఉద్దేశ్యమని, దేశంలోనే ఇటువంటి పథకం ఉండటం ఇదే మొదటిసారని చౌదరి తెలిపారు. సెప్టెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకాన్ని, దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలకు ఒక నమూనాగా రూపొందించామని ఆయన చెప్పారు.
 
ఈ పథకం కింద, యాత్రికులు సహజ మరణం పొందితే వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 10లక్షల పరిహారం లభిస్తుంది. గత రెండు నెలల్లో తిరుమలలో 17 మంది యాత్రికులు మరణించారని, వారిలో ఏడుగురి కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందించామని, మిగిలిన వారికి త్వరలోనే పరిహారం అందజేస్తామని చౌదరి తెలిపారు.
 
సుమారు ఏడాదిన్నర కాలం పాటు చేసిన కృషి, అనేక దఫాల చర్చల తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని, దేశానికే ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో దీనిని రూపొందించామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పరిహార మొత్తాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
మరణ ధృవీకరణ పత్రం, నామినీకి సంబంధించిన బ్యాంక్ వివరాలను సమర్పించిన వెంటనే, క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని దొరైస్వామి తెలిపారు. దేశంలోనే యాత్రికులకు జీవిత బీమా కవరేజీని కల్పించడంలో టీటీడీ ఒక మార్గదర్శక సంస్థగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తితో, శబరిమలలోని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు,  జమ్మూలోని శ్రీ మాతా వైష్ణో దేవి శ్రైన్ బోర్డు అధికారులు కూడా అటువంటి పథకాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించేందుకు ఎల్ఐసీని సంప్రదించారని ఆయన తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రియుడి చేతిలో టెక్కీ హత్య.. మోసం చేసిందని గోడకు తలను బాదాడు.. రాత్రంతా శవం పక్కనే...?