మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ
మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ నెలవారీ పాస్‌లపై కొత్త రాయితీలను ప్రకటించింది. బస్సు ప్రయాణాన్ని మరింత ఆదాగా, సౌకర్యంగా మార్చే లక్ష్యంతో నెలవారీ సీజన్ టిక్కెట్లపై పలు కొత్త రాయితీలను, సదుపాయాలను ప్రకటించింది. సవరించిన ఈ నిబంధనలు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకిరానున్నట్టు స్పష్టం చేసింది.
మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నప్పటికీ, మెట్రో, రాజధాని, డీలక్స్ వంటి సర్వీసుల్లో పాస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాంటి వారి కోసం ఇకపై నెలవారీ రూట్ పాస్‌లపై 50 శాతం రాయితీని కల్పించారు. అంటే కేవలం 15 రోజుల రుసుము చెల్లిస్తే చాలు.. నెల మొత్తం ప్రయాణించవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ - వరంగల్ రూట్ పాస్‌ను కేవలం సగం దరకే పొందవచ్చు.
అంతేకాకుండా, పాస్‌ల ధరలను మరింత తగ్గించేందుకు టోల్‌ప్లాజా చార్జీల లెక్కింపు విధానంలో కూడా మార్పులు చేసింది. ఇప్పటివరకు వరకు 25 రోజులకు లెక్కిస్తున్న టోల్‌చార్జీలను ఇకపై 20 రోజులకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల అన్ని రకాల పాస్‌ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. కొత్త డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్‌ను కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ పాస్‌తో ఈ-డీలక్స్ సర్వీసుల్లనూ ప్రయాణించే వీలుంటుంది.
ఇక, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ వంటి నగరాల్లో నెవవారీ సిటీ పాస్ ఉన్నవారికి మరో అదనపు ప్రయోజనం కల్పించనున్నారు. పాస్ ఉన్నవారు ఆదివారాల్లో అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

