పెళ్లి పేరుతో వివాహేతర సంబంధం - రూ.1.18 కోట్లు వసూలు చేసిన కేటుగాడు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్న ఓ కేటుగాడు.. ఓ మహిళ వద్ద ఏకంగా రూ.1.18 కోట్లను వసూలు చేశాడు. పైగా, ఇంకా డబ్బులు కావాలంటూ వేధించాడు. వీటిని భరించలేని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పీర్జాదిగూడలోని కెనరా నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పీర్జాదిగూడలోని కెనరానగర్‌కు చెందిన మహిళ(41)కు 2024లో కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో కోనేటి ప్రదీప్(41) పరిచయమయ్యాడు. తనకు ఇదివరకే వివాహమై, విడాకులయ్యాయని... తల్లిదండ్రులు లేరని పరిచయం చేసుకున్నాడు. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు.
ఆమె వద్ద పలు దఫాలుగా వివిధ రూపాల్లో రూ.1.18 కోట్ల వరకు నగదు తీసుకున్నాడు. పెళ్లి మాటెత్తితే మాత్రం మూడేళ్లుగా దాటవేస్తూ వచ్చాడు. చివరకు ఆమెను వదిలించుకునే కుట్రలో భాగంగాత, ప్రదీప్ తనతో ఉన్న ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని బెదిరించడమే కాకుండా రూ.4 లక్షలు వసూలు చేశాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

