డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. కేటీఆర్
తమ పార్టీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుందని, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలంగాణకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ మొదటి నుంచీ వాదిస్తూ వస్తోందని ఆయన చెప్పారు. పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం అలాగే కొనసాగాలని బీఆర్ఎస్ నిరంతరం కోరుతూ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. లోక్సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచినప్పటికీ, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని అలాగే కొనసాగించాలనే ప్రతిపాదన, బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రధాన ఆందోళనలను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రణాళిక వల్ల లోక్సభలో తెలంగాణకు ఉన్న స్థానాల సంఖ్య 17 నుండి 26కు పెరుగుతుందని కేటీఆర్ వివరించారు. అంతేకాకుండా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి బీఆర్ఎస్ ఎప్పుడూ అనుకూలంగానే ఉందని, దీని కోసం తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

