1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Hyderabadi Killed In Riyadh Airport Attack

సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి

Flight
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరగడంతో, హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించారు. అలాగే ఆయన ఇద్దరు కుమారులు, కామారెడ్డికి చెందిన మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 
 
మరణించిన వ్యక్తి మహమ్మద్ యూసుఫ్ అలీ మెహదీపట్నం నివాసి, రియాద్‌లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నారు. సుమారు వారం రోజుల క్రితం, ఆయన తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అత్తతో కలిసి ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుండి సౌదీ అరేబియాకు వెళ్లారు. 
 
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో గాయపడిన 300 మందిలో 10 మంది భారతీయులు ఉన్నారు. బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి తాము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.
 
ఈ దాడిలో మరణించినట్లుగా చెబుతున్న 13 మందిలో యూసుఫ్ అలీ ఒకరు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మదీనాకు వెళ్లేందుకు రియాద్ విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగినప్పుడు యూసుఫ్ చెక్-ఇన్ కియోస్క్ సమీపంలో వేచి ఉన్నట్లు సమాచారం. 
 
శిథిలాలు అతనిపై పడటంతో అతను ప్రాణాంతక గాయాలపాలయ్యాడు. కాగా అతని ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. అతని పెద్ద కుమారుడికి గాజు పెంకుల వల్ల అనేక గాయాలై పరిస్థితి విషమంగా ఉందని, అతని అత్త తలకు గాయాలయ్యాయని, అయితే అతని భార్య, కుమార్తె సురక్షితంగా ఉన్నారని సమాచారం. కామారెడ్డికి చెందిన షేక్ సయీద్ కూడా ఈ దాడిలో గాయపడి, రియాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం