Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకలో సజ్జనార్.. మహిళలందరి జీవితాలలో...?
హైదరాబాద్లోని పెట్లబురుజు వద్ద ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు రంగురంగుల బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొనడంతో, కార్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా సజ్జనార్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ప్రకృతిని పూజించే విశిష్ట సంప్రదాయానికి ప్రతీక. శాంతిభద్రతలను కాపాడటానికి నిరంతరం కష్టపడుతున్న మన పోలీసు కుటుంబాలతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు.
ప్రకృతి మాత ఆశీస్సులతో ఈ పండుగ మహిళలందరి జీవితాలను కొత్త వెలుగులతో, ఆనందంతో, మంచి ఆరోగ్యంతో నింపుతుందని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

