1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Aadhaar Biometric Authentication Must For Subsidised LPG Refills From October

అక్టోబరు నుంచి వంటగ్యాస్ సిలిండర్‌కు కొత్త నిబంధన - ఏంటది?

gas cylinders
దేశంలో రాయితీ ధరపై వంట గ్యాస్ సిలిండర్ పొందే వినియోగదారులకు కేంద్రం కొత్త షరతు విధించింది. ఇకపై సబ్సీడీ ధరపై వంటగ్యాస్ సిలిండర్లు కావాలంటే అక్టోబరు ఒకటో తేదీ నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
అర్హులైన కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను సులభంగా గుర్తించి తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
 
వినియోగదారులు వివిధ మార్గాల్లో ఈ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసే సౌలభ్యం ఉంది. సిలిండర్ డెలివరీ చేసే సమయంలో సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా, లేదా నేరుగా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 
 
వీటితో పాటు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల (ఇండేను ఇండియన్అయిల్ వన్, భారత్ గ్యాస్‌కు హలోబీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్‌కు హెచ్‌పీపే) ద్వారా కూడా వినియోగదారులు స్వయంగా ప్రామాణీకరణ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
 
ఇప్పటికే బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ వర్తించదు. అటువంటి వారు సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
కాగా, సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికే బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేశారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణాలో జోరుగా కురుస్తున్న వర్షాలు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక