ప్రేమ ఒకవైపు.. వివాహేతర సంబంధం మరోవైపు.. ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య
ప్రేమ, వివాహ బంధాలు పెటాకులు అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఒక మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ఇంకా తన ప్రియురాలిని హత్య చేసిన ఆ దుండగుడు ఆమెను దహనం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. కోట్ర గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరుమల్ల అనుష కల్వకుర్తి పట్టణంలోని ఒక లేడీస్ కార్నర్ దుకాణంలో పనిచేసేది. ఆమె భర్త చెన్నయ్య ఒక హోటల్‌లో పనిచేస్తుండగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అనుషకు అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.
బుధవారం రాత్రి రాములు ఆమెను ఒడ్డొనిరల్లకు తీసుకెళ్లి హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహానికి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు, పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రాములుతో పాటు నేరంలో అతనికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
