విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో చిరంజీవి కుమార్తెకు కీలక పదవి
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నియమకంతో సుస్మిత ఇకపై దుర్గమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అవుతారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న వసతులు, ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులు, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ట్రస్ట్ బోర్డుకు ఆమె తగిన సలహాలు సూచనలు ఇస్తారు.
కాగా, సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకపై చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల తన తండ్రి చిరంజీవితో నిర్మించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో ఆమె బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
ఇదిలావుంటే, ఇక్కడ ఆసక్తకరమైన అంశమేమంటే సుస్మిత తల్లి, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తెలంగాణాలోని సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ఇపుడు సుస్మిత కూడా ఏపీలోని ప్రముఖ దేవాలయ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా స్థానం లభించడం గమనార్హం.
