జావా సముద్రంలో మునిగిపోయిన నౌక - ఆరుగురి మృతి - 130 మంది గల్లంతు
ఇండోనేషియాలో ప్రయాణికుల నౌక ఘోర ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాద సమయంలో 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి మొత్తం 243 మంది ఉన్నారు. ఈ నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 107 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించగా, ఆరుగురి మృతదేహాలను వెలికితీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు జలసమాధి కాగా, మరో 130 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తూర్పు జావాలోని సురబయ నుంచి శనివారం బయలుదేరిన ఈ నౌక, దక్షిణ కాలిమంటన్‌లోని బంజర్మాసిన్‌కు బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కెప్టెన్ నుంచి అధికారులకు చివరి సందేశం అందింది. సముద్రంలో దాదాపు 3 మీటర్ల ఎత్తున అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని, దీంతో నౌక ఒకవైపునకు ఒరిగిపోతోందని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బంజర్మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. నౌకాదళానికి చెందిన నౌకతో సహా నాలుగు నౌకలు, ఒక హెలికాప్టర్, సమీపంలోని టగ్ బోట్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కాపాడిన వారిని సమీపంలోని తూర్పు జావా పోర్టుకు తరలించారు.

