ఘట్కేసర్లో దారుణం: బంధువును బండరాయితో కొట్టి చంపేసిన బాలుడు
హైదరాబాద్ ఘట్కేసర్లో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు బంధువును బండరాయితో కొట్టి చంపేశాడు. నిందితుడైన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 17 ఏళ్ల బాలుడు పని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు.
ఘాట్కేసర్ పరిధిలోని అవుషాపూర్‌లో ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, తన బంధువైన శివ వద్ద ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత మళ్లీ వారి మధ్య వాగ్వాదం చెలరేగింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు, బండరాయితో శివ తలపై బలంగా కొట్టాడు. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందగా, బాలుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

