లంచం తీసుకున్నారో కఠిన చర్యలు : హైదరాబాద్ సీపీ హెచ్చరికలు
హైదరాబాద్ నగర కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ ముళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకతరించారు. ఆ వెంటనే పోలీస్ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
శాఖాపరమైన చర్యలతో పాటు, నేరం తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కొందరు పోలీసు అధికారులు లంచం, బెదిరింపుల కేసుల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి, అక్రమ నిర్బంధాలు, భూవివాదాలు వంటి సివిల్ అంశాలలో పోలీసుల జోక్యంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. తమ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతాయని చెప్పారు.
ఎవరైనా అధికారి తప్పుగా ప్రవర్తిస్తే, బాధితులు నేరుగా జోనల్ హెడ్‌కు ఫిర్యాదు చేయవచ్చని, ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అవినీతి, అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన పోలీసు సిబ్బంది రికార్డులను కూడా ఆయన సమీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
పోలీసులు స్టేషన్లకే పరిమితం కాకుండా, తమ పరిధిలోని ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని భగవత్ ఆదేశించారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. ఉదయం పూట గస్తీ పనితీరును సమీక్షించి, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని పెట్రోలింగ్ పెంచాల్సిన ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు.

