బ్రేకప్ చెప్పిన ప్రియుడికి షాకిచ్చిన యువతి... ఏఐ సాయంతో షీ టీమ్స్ నోటీసు
ఐదేళ్లుగా డేటింగులో ఉండి బ్రేకప్ చేసిన ప్రియుడికి ప్రియురాలు తేరుకోలేని షాకిచ్చింది. కృత్రిమ మేధ సాయంతో షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీస్ నోటీసు తయారు చేసి ప్రియుడికి పంపించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో వెలుగు చూసింది.
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న యువకుడు యేడాదిగా దూరంగా ఉండటంతో ప్రియురాలు అతనిపై కక్ష గట్టింది. అలాగే, ప్రియుడు తనను సోషల్ మీడియాలో సైతం బ్లాక్ చేయడంతో అతన్ని భయపెట్టేందుకు ఈ కొత్త ప్లాన్ వేసింది. హరి అనే స్నేహితుడి ద్వారా యువకుడికి వాట్సాప్‌లో నోటీసు పంపించింది.
ఈ నోటీసు నిజమేనని నమ్మిన ప్రియుడు.. షీ టీమ్స్ కార్యాలయానికి వెళ్లి విచారించాడు. అక్కడ ఆ నోటీసు నకిలీదని తేలడంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు జేశాడు. దీంతో పోలీసులు ఆ యువతితో పాటు ఆమె స్నేహితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

