టైలర్ కుమారుడుకి గోల్డెన్ ఛాన్స్ - రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టైలర్ కుమారుడికి గోల్డెన్ ఛాన్స్ వరించింది. అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించి, ఇతర విద్యార్థులకు ఆదర్శనంగా నిలిచాడు. తన అద్భుతమైన ప్రతిభతో ఈ అత్యున్నత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
ఏపీలోని కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్ ఈ ఘనత సాధించాడు. అతని తండ్రి గంగాధరరావు దివ్యాంగుడు (చెవిటి, మూగ). ఆయన టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి కూడా భర్తకు చేదోడు వాదోడుగా టైలరింగ్ పనుల్లో సాయం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అఖిలేశ్ కష్టపడి చదువుకున్నాడు.
సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలేశ్, ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూల్లో సత్తా చాటాడు. కెనడాకు చెందిన 'క్వాంట్రైస్ టెక్ ఏఐ' అనే సంస్థ అతడిని ఏఐ ఇంజినీర్‌గా ఎంపిక చేసుకుని రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉంటుందని, అఖిలేశ్ ఇప్పటికే విధుల్లో చేరినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
అఖిలేశ్‌తో పాటు రాజేశ్ అనే మరో విద్యార్థి కూడా ఇదే ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం విశేషం. తమ యూనివర్సిటీలో మొదటి ఏడాది నుంచే ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని యాజమాన్యం పేర్కొంది. పేదరికాన్ని జయించి, అత్యున్నత స్థాయికి చేరిన అఖిలేశ్ప సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
