1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Hyderabad: Massive 72-Ft Eco-Friendly Ganesh Idol Coming Up In Nagole

Eco-Friendly: నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహం.. విశేషాలు ఏంటంటే?

Nagole
Nagole
గణేశ చతుర్థి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ అష్ట సిద్ధి మహా గణపతిగా పిలువబడే ఈ విగ్రహాన్ని రసాయనాలు లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటివి ఏవీ వాడకుండా, పూర్తిగా మట్టి వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తున్నారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, విగ్రహ తయారీ నుండి నిమజ్జనం వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ విగ్రహాన్ని అక్కడే (తయారు చేసిన ప్రదేశంలోనే) నిమజ్జనం చేయనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పర్యావరణ హితమైన విగ్రహాల తయారీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న తిరంగా యూత్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
నిర్వాహకుడు సాయి ముదిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం, విగ్రహం తయారీ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది ఇక్కడ 72 అడుగుల ఎత్తైన 'శ్రీ అష్ట సిద్ధి మహా గణపతి' విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది పూర్తిగా పర్యావరణ హితమైన విగ్రహం. గడ్డి, కలప, గంగా నది మట్టి, వాటర్ కలర్స్‌ను మాత్రమే వాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. విగ్రహం తయారీలో సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన తుది మెరుగులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు. 
 
దీని తయారీకి అవసరమైన ముడి సరుకులు మరియు మట్టిని కోల్‌కతా నుండి తెప్పించామని, దీనికి పూర్తిగా వాటర్ కలర్స్‌ను ఉపయోగించామని మరో నిర్వాహకుడు కోటకొండ నాగేశ్ తెలిపారు. దీనిని రూపొందించడానికి సుమారు రెండున్నర నెలల సమయం పట్టిందని, 21 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమించి దీనిని పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఈ విగ్రహ తయారీకి మొత్తం సుమారు రూ. 50 లక్షల ఖర్చు అయిందని అంచనా. 
 
ఈ పని కోసం ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ నుండి సుమారు 20 మంది కళాకారులను రప్పించినట్లు నిర్వాహకుడు ఉపేంద్ర గుప్తా పేర్కొన్నారు. సంప్రదాయ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దర్శనం కోసం ప్రతిరోజూ సుమారు 10,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం ముఖ్యం.. జంక్ ఫుడ్స్‌పై సుప్రీం సీరియస్