మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..
రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళా బైకరును కారు వెంబడించింది. తనకు కాస్త దూరంగా ఉండాలని ఆమె చెప్పింది. అయినా కారు ఆగలేదు. చివరకు బైకు అడ్డంగా వచ్చి ఢీకొట్టిందని సియా అనే బైకర్ ఆరోపించారు. ప్రమాదం ధాటికి ఆమె బైక్ నుంచి కిందపడిపోయారు. బైక్ మాత్రం రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఘటన మొత్తం బైకుకు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డవడంతో వీడియో ఇప్పుడు వైరల్‌ఘా మారింది.
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు సియా తెలిపారు. ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైకుపై ఆమె తన బైకింగ్ గ్రూపుతో కలిసి వెళ్తున్నారు. అప్పటి నుంచే ఓ కారు తనను వెంబడిస్తోందని ఆమె ఆరోపించారు.
కారు తన దగ్గరకు వచ్చిన సమయంలో అందులో ఉన్నవారు దురుసుగా ప్రవర్తించారని సియా చెప్పారు. కాస్త దూరంగా ఉండాలని కోరగా.. బైక్ ఆపాలని చెప్పారని తెలిపారు. వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందన్నారు. కారు తనను అడ్డుకోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు.
ఆమె వెనుకే వస్తున్న స్నేహితుడు కూడా పరిస్థితిని గమనించి కారు తనకు దగ్గరగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని సియా తెలిపారు. అయినా కారు తమను వెంబడించడం కొనసాగించిందన్నారు. చివరకు డ్రైవర్ తన బైకుకు అడ్డంగా కారు తీసుకురావడంతో ఢీకొట్టినట్లు ఆరోపించారు. ఆ వెంటనే కారు అక్కడి నుంచి దూసుకెళ్లిపోయిందన్నారు.
ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆపి డ్రైవరును ప్రశ్నించినట్లు తెలిపారు. ప్రమాదం అతడి తప్పిదం వల్లే జరిగిందని చెప్పినా.. డ్రైవర్ అంగీకరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని సియా ఆరోపించారు.
ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కారు నంబరుతో పాటు ఆర్సీ యజమాని పేరును కూడా వెల్లడించారు. వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన కనిపించింది.

