ఓవర్ టేక్ చేశాడని చేతి వేళ్లు నరికేసిన మైనర్లు.. ఎక్కడ?
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. వాహనాన్ని ఓవర్ టేక్ చేయడాన్ని జీర్ణించుకోలేని ముగ్గురు మైనర్లు... ఓ వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు. ముగ్గురు మైనర్లు కొడవళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో 26 యేళ్ల యువకుడు తీవ్రంగా గాయాలతో ఆస్పత్రి పాలై, ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ దారుణం పట్టపగలు జరగడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పూణె జిల్లా ఖేడ్ తాలూకాలోని టిన్హవాడి గ్రామానికి చెందిన శివం బాలాసాహెబ్ కర్మారే (26) అనే వ్యక్తి నవంబరు 10వ తేదీన మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై రాజ్గురు నగర్ ప్రాంతంలో వెళుతున్నాడు. అంతకుముందు వాహనం ఓవర్ టేక్ విషయంలో కొందరితో అతనికి వాగ్వాదం జరిగింది. ఈ విషయం మనసులో పెట్టుకున్న ముగ్గురు మైనర్లు మార్గమధ్యంలో శివంను అడ్డగించి, కొడవళ్లు, ఇతర ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో శివం తల, వీపు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అతని మూడు వేళ్లు తెగిపోగా, ఒక చేయి పూర్తిగా చచ్చుబడిపోయినట్టు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సుమారు 700 కుట్లు వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
బాధితుడు సోదరుడు ఆదిత్య కలురాం కర్మారే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాక్షేవాడి ప్రాంతంలో దాక్కున్న ముగ్గురు మైనర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలే జరిగిన ఈ దాడితో స్థానిక ప్రజలు భయాందోళలకు గురయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

