శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (08:49 IST)

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

Narayana
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పనులను తిరిగి ప్రారంభించామన్నారు. మిగిలిన పనులను కూడా దశల వారీగా చేపడుతామన్నారు. అలాగే, రాజధాని అమరావతి పరిధిలో సుందరీకరణ పనులు కూడా ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా అమరావతిలో మరో రూ.2723 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
జూన్ 12వ తేదీ నాటికి 1.18 లక్షల టిడ్కో గృహాల నిర్మాణ పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటివరకు రూ.47288 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.