శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (09:41 IST)

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

chandrababu naidu
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి ఎవరన్నది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లు ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. అలాగే, ఆయనకు రూ.10 కోట్ల అప్పు ఉంది.
 
అయితే, ఈ జాబితాలో కేవలం రూ.15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఆయన పేరిట అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు కూడా ఉంది. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.51 కోట్లు. 23 కోట్ల రుణభారం ఉంది. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ రూ.55 లక్షల ఆస్తితో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నారు. 
 
రూ.1.18 కోట్ల ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కింది నుంచి మూడోస్థానంలో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లు కాగా, వారి సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310గా ఉంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది.