శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (17:42 IST)

అసెంబ్లీలో నిలబడి అధ్యక్షా అని సంబోధిస్తూ జగన్ మాట్లాడాలి : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇపుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయనకు ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే కేటాయిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. పైగా, జగన్ అసెంబ్లీకి వచ్చి నా ఎదుట నిలబడి అధ్యక్షా అని సంబోధించాలని స్పీకర్ అన్నారు. 
 
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చంఢీయాగ, నవగ్రహ యాగాలు జరిగాయి. వీటిలో స్పీకర్ అయ్యన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. పూర్వకాలంలో రాక్షసుల బారి నుంచి రాజ్యాన్ని కాపాడుకునేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు యాగాలు చేసేవారని, అలాంటి రాక్షస పాలన ఏపీలో గత వైకాపా కాలంలో వచ్చిందని దుయ్యబట్టారు. 
 
'కొంతమంది దుర్మార్గులు, రాజకీయాలకు అర్థం తెలియనివారు గత ప్రభుత్వంలో ప్రభువులయ్యారు. గత పాలకుడికి అధికారం తెలుసు తప్ప.. పరిపాలన తెలియదు. మూర్ఖత్వంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారు. 
 
జగన్‌ కేవలం ఓ ఎమ్మెల్యే మాత్రమే. సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే జగన్‌కు ఇస్తాం. వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. నా ఎదుట అసెంబ్లీలో 'అధ్యక్షా' అని సంబోధిస్తూ మాట్లాడటం ఇష్టం లేకే జగన్‌ అసెంబ్లీకి రావడం లేదు. బయట మీడియా ముందు మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. జగన్‌ తప్ప.. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీకి రావడం లేదు అని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు.