శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కొత్త మద్యం విధానానికి ఏపీ మంత్రివర్గం సమ్మతం - సాక్షి పత్రికకు రూ.205 కోట్లు

liquor
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి మంత్రిమండలి సమ్మతం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త పాలసీలో భాగంగా, నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. 
 
అలాగే, గత వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై మంత్రిమండలి సుధీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యంగా, ఈ వ్యవస్థను పునరుద్ధరించాలా వద్దా అనే అంశంపై మంత్రులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ వలంటీర్ వ్యవస్థ కాలపరిమితి గత యేడాది ఆగస్టు నెలతోనే ముగిసినట్టు అధికారులు వెల్లడించారు. యేడాది క్రితమే వాలంటీర్లను జగన్‌ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యవుల్‌ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. 
 
తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.