శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:24 IST)

నటి జెత్వానీ కేసులోని ఆధారాలు భద్రపరచండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

Kadambari Jethwani
ముంబై నటి కాదంబరి జెత్వానీ చేసిన లైంగిక వేధింపుల కోసం ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణనను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
 
తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ కేసుపై మీడియాలో డిబెట్లు జరపకుండా నిలువరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఠాణాలో నమోదు చేసిన కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలన్నారు.
 
ఈ కేసులో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అధికారులందరూ ప్రస్తుతం వరద సహాయ చర్యల్లో ఉన్నారన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.