శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (16:04 IST)

దివ్యాంగురాలి కోటాలో టీచర్ ఉద్యోగం.. తొలగింపు సబబేనన్న హైకోర్టు

నకిలీ ధృవీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన మహిళను తిరిగి విధుల నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనంటూ ఏపీ హైకోర్టు సమర్థించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
జి.వెంకట నాగమారుతి అనే మహిళ 2012లో దివ్యాంగురాలి కోటా కింద స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లం) పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తనకు 70 శాతం వినికిడి సమస్య ఉన్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పి. నాగులవరం జిల్లా పరిషత్ హైస్కూలులో ఉద్యోగంలో చేరారు. 
 
అయితే, ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలడంతో 2015 మార్చి 16న ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో నాగమారుతి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీఏటీ.. సర్వీసును డిశ్చార్జ్ చేసే స్వేచ్చను ఇస్తూ 2017 అక్టోబరు 27వ తేదీన ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ తీర్పును నాగమారుతి హైకోర్టులో సవాలు చేయగా, తాజాగా విచారణ జరిపిన జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ ఎన్.విజయ్‌తో కూడిన ధర్మాసనం పిటిషనరు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. దివ్యాంగుల కోటా కిందకు రానని తెలిసి కూడా నకిలీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్ జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. డీఈవో ఉత్తర్వులను సమర్థించడంతోపాటు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.