శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (18:41 IST)

విపత్తుల నిర్వహణలో సీఎం చంద్రబాబు విధానాలు ఓ కేస్ స్టడీ : హోం మంత్రి అనిత

Anitha
విపత్తుల నిర్వహణలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెరుపు వేగంతో స్పందించడం, ఆయన తీసుకుని అమలు చేసిన విధానాలు, చేపట్టిన రక్షణ చర్యలు దేశంలోనే ఒక కేస్ స్టడీ అవుతాయని రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు. విజయవాడ నగరంతో పాటు వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చేపట్టిన చర్యలు అమోఘమని ఆమె వ్యాఖ్యానించారు. ఏకంగా వారం రోజులకు పైగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టారని ఆమె గుర్తు చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ, హుద్‌హుద్, తల్లీ, విజయవాడ వరదల నుంచి ప్రజలను కాపాడిన తీరే అందుకు నిదర్శనం. వరద ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలను చేపట్టే విషయంలో కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను, అవసరమైన నిధులను చంద్రబాబు ఇచ్చారు. రోడ్లతోపాటు ఇళ్లను కూడా శుభ్రపరచడం దేశంలో ఎక్కడా జరగలేదు. బుడమేరు గండ్లను అత్యంత వేగంగా పూడ్చాం. అది అంత సాధారణ విషయం కాదు. 
 
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రతిపక్షం ఆపద తెచ్చేందుకు యత్నిస్తోంది. వరదలోనూ బురదజల్లే విపక్ష నాయకులు దేశ ద్రోహులు. ఉద్దండరాయునిపాలెం సమీపంలో ఉండాల్సిన పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు ఎలా వచ్చాయి? అవి బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే పరిస్థితి ఊహకు కూడా అందేదికాదు. గత ప్రభుత్వ లోపాలపై గళమెత్తిన వ్యక్తులపై దేశద్రోహం కేసు పెట్టారు. మరి ఇటువంటి ప్రజలకు ముప్పు తెచ్చే పనులు చేసే వారిని ఏం చేయాలి? వరదలపై సోషల్ మీడియాలో వక్రీకరణ తగదు. 
 
74 ఏళ్ల వయసులో తీరిక లేకుండా పనిచేస్తున్న సీఎంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. కొల్లేరు, బుడమేరు, ఏలేరు పరీవాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఐదేళ్ల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లామని ఒక ఐఏఎస్ అధికారి చెప్పారు. దాన్నిబట్టి గత ప్రభుత్వ పని తీరు ఏమిటన్నది అర్థమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానానికి కనీసం పైసా ఖర్చు చేయకుండా విపత్తు నిర్వహణ సంస్థను నిర్వీర్యం చేశారు. విశాఖలోని తెన్నేటి పార్కు, గోపాలపట్నం, సీతమ్మధార ప్రాంతాల్లో కొండ చరియలు విరి గిపడకుండా తగిన చర్యలు చేపడతాం' అని మంత్రి అనిత చెప్పారు.