శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (14:27 IST)

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

ias officer srilakshmi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతతో అంటకాగి, వైకాపా నేతలు చెప్పినట్టుగా తలాడించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై టీడీపీ సారథ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఓ కన్నేసివుంచింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు పొందిన శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం ఎదురైంది. ఆమె తీసుకొచ్చిన ఫైలుపై సంతంకం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె నిశ్చేష్టురాలై వెనక్కి వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం శ్రీలక్ష్మి రాష్ట్ర పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పి.నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మంత్రి చాంబర్‌కు ఓ ఫైలు తీసుకొచ్చారు. అయితే మంత్రి ఆ ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆ ఫైలును తిరిగి తీసుకెళ్లారు. 
 
ఇటీవల కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు శ్రీలక్ష్మి పూలబొకే తీసుకుని వచ్చారు. అయితే, ఆ బొకే మీరే ఉంచుకోండి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం ఓ వీడియలో కనిపించింది. కాగా, శ్రీలక్ష్మి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన విషయం తెల్సిందే. అలాగే, జగన్ అవినీతి కేసుల్లో కూడా ఆమె కొంతకాలం పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత 2019లో ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఇపుడు మళ్లీ కష్టకాలం మొదలైంది.